అడుగుల లెక్క.. ఆరోగ్యం పక్కా..
నడకకూ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం
ప్రణాళికాబద్ధంగా సాగితే ప్రయోజనం
ఈనాడు, హైదరాబాద్
జీవితం ఆరోగ్యంగా ఉత్సాహంగా సాగాలంటే నిత్యం 10 వేల అడుగులు పడాల్సిందేనని వైద్యులు చెబుతుంటారు. ఉదయం నిద్ర లేవగానే నడకకు వెళ్లడం కొందరికి అలవాటుగా ఉంటుంది. మరి కొందరు మాత్రం ఒకరోజు వెళితే మరోరోజు బద్ధకిస్తుంటారు. ఇలాంటి వారు సాంకేతికతకు చేరువైతే నిత్యం ఒక ప్రణాళిక ప్రకారం అడుగులు వేసేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందువల్లనే ఇటీవల నిత్యం నడకకు వెళ్లే వారు తాము ఎన్ని అడుగులు వేస్తున్నాం..ఎంత దూరం నడుస్తున్నాం.. ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చవుతోందన్న లెక్కలు పెట్టుకుంటూ నడుస్తున్నారు. లక్ష్యం ఉంటేనే..
నిత్యం నడవడం..లేదా వ్యాయామం చేయడం క్రమం తప్పకుండా కొనసాగాలంటే ఒక లక్ష్యం ఉంటేనే సాధ్యమవుతుంది. కచ్చితంగా రోజూ పది వేల అడుగులు వేస్తే గుండె సంబంధిత వ్యాధులు చాలా వరకు దూరమవుతాయని ప్రముఖ వైద్యులంతా వివిధ సందర్భాల్లో చెబుతున్నారు. ఈ విషయమై అవగాహన పెరుగుతుండటంతో రోజూ నడకకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. కాలనీల్లోని చిన్నపాటి పార్కులకూ నడకకు.. వ్యాయామాలకూ వచ్చే వారి సంఖ్య ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలా ఎక్కువని వాటి నిర్వాహకులు వివరిస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు చాలామంది లక్ష్యం మేరకు (రోజుకి 10వేల అడుగులు) నడిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటున్నారు. ఉదయం వేళ నడుస్తున్నప్పుడు ఏడు వేల అడుగులు పూర్తి చేస్తే రాత్రి నిద్రకు ఉపక్రమించేలోగా మిగిలిన మూడు వేల అడుగులు పడేలా చూసుకొంటున్నారు. ఇందుకోసం పెడోమీటర్లు లాంటివి ధరిస్తూ వస్తున్నారు. కొందరు వీటిని కొనుగోలు చేస్తుంటే అత్యధికులు చరవాణినే ఇందుకు వినియోగిస్తున్నారు.
యాప్ సాయంతో..
చరవాణి ఇప్పుడు కేవలం మాట్లాడుకోవడానికి... సంక్షిప్త సందేశాలు పంపుకోవడానికే కాకుండా... ఇతరత్రా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్లు జీవన విధానాన్నే మార్చేసే దశకు చేరాయి. ఆరోగ్యానికి సంబంధించి అనేక యాప్‌లు సేవలు అందిస్తున్నాయి. నడక విషయంలోనూ పెడోమీటర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉచితంగానే ఈ సేవలు లభిస్తుంటాయి. ఇందులో మనం వేసే ప్రతి అడుగు లెక్కా కనిపిస్తుంది. ఉదయం మంచం దిగి కాలు కింద పెట్టినప్పటి నుంచి వేసే ప్రతి అడుగూ నమోదవుతుంది. ఎంత వేగంగా నడుస్తున్నామో కూడా తెలిసిపోతుంది. ఉదయం నడక ప్రారంభించిన తరవాత ఎంత సేపటిలో ఎన్ని అడుగులు వేశాం..ఎన్ని కి.మి. నడిచామనే లెక్క ఈ యాప్ చెబుతుంది. నడవడం వల్ల ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చయిందో ఎప్పటికప్పుడు గమనిస్తూ అడుగులు వేయవచ్చు. ఇలా చూసుకోవడానికి అలవాటు పడితే ఇక నడకకు బద్ధకించడం అనే ప్రసక్తే ఉండదని వీటిని వినియోగిస్తున్న వారు అంటున్నారు. ఒకవేళ ఒకరోజు ఉదయం తక్కువ అడుగులే వేసినా.. ఆ లెక్క మన చరవాణిలోనే కనిపిస్తుండటంతో సాయంత్రంలోగా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మిగిలిన అడుగులు వేయించేవిధంగా ఇవి ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. అందుకే ఇప్పటి వరకు మీ చరవాణిలో ఈ యాప్ లేకుండా వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి.
నిత్యం సాగాలంటే..
* నలుగురితో కలిసి ఒక నిర్దిష్ట సమయంలో నడవండి..
* నడిచేప్పుడు ఇతరులతో వాదోపవాదాలకు తావిచ్చే విషయాలపై చర్చించకుండా సరదా కబుర్లతో సాగితే బాగుంటుంది.
* చుట్టూ పచ్చదనం ఉండే ప్రాంతాల్లో.. ప్రకృతిని ఆస్వాదిస్తూ నడిస్తే మనసుకు ఉల్లాసం కలుగుతుంది.
* నడకకు ఒక లక్ష్యం పెట్టుకుంటే అంతరాయాలను అధిగమించవచ్చు.
అడుగుల లెక్క.. ఆరోగ్యం పక్కా.. నడకకూ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ప్రణాళికాబద్ధంగా సాగితే ప్రయోజనం ఈనాడు, హైదరాబాద్
4/
5
Oleh
Unknown


